కవులు కలాలను కదిల్చారు. గళాలను విదిల్చారు. కర్మాచరణానికి పట్టం గట్టారు. శ్రమ జలాలను, విదిల్చేలా ఉద్యమింపజేశారు. వ్యక్తి -సమాజ వికాసానికి, కంకణం కట్టి కావ్యాలతో కదిలించారు. కనువిప్పు కలిగించారు. వాటిలో మచ్చుకు కొన్నిటిని పరిశీలిద్దాం.
“సాహసికానివాడు/ జీవన సమరానికీ స్వర్గానికీ పనికిరాడు/ హిమసుందర శృంగమైన ఎవరెస్టుని/ ఒక టెన్సింగే ఎక్కగలడు. అన్న తిలక్ కవి పంక్తుల్లో శ్రమైక జీవన సూత్రం సాక్షాత్కరిస్తుంది. “దాశరథి” యువకులను కర్తవ్యోన్ముఖులను చేస్తూ “నవభారత యువకులారా! కవులారా! కథకులారా! భవితవ్యపు హవనానికి హెూతలు/ నూతన భూతల నిర్మాతలు మీరే, మీరే!” అంటూ అగ్నిధార కావ్యంలో యువత,శ్రమ జీవనానికి బాటలు వేశాడు.
శరీర కష్టంతోనే ఫలం చేకూరునని “ఆంధ్ర గథాలహరి’’లో చెప్పబడిందిలా.కష్టపడిన యంత, కలుగు విజయలక్ష్మి కాలగతిని మృతియు కలుగవచ్చు పాటుపడక ఎట్టి పని పాట లేకున్నా మరణ మెట్లు తట్టు? మాన్య తెట్లు ? కష్టపడితే విజయం వరిస్తుంది. కాలంతోపాటు మరణం ఎలా వస్తుంది. అసలు కష్టపడకుండా ఊరికే కూర్చున్నా మరణం రాకుండా ఉండదు. కావున కష్టపడి పనిచేసి గౌరవంగా బతకాలని ఆంధ్ర గాథాకారుని సందేశం.
శ్రీరాముడు శబరి ఆశ్రమంలో అడుగుపెట్టినంతనే అక్కడున్న భూ పరిమళాలకు, ఆహ్లాదకరమగు వాతావరణానికి విస్మయంతో పులకించిపోయాడు. అందుకు కారణం ఏంటని శబరి మాతను అడిగాడు. ‘‘ఈ ఆశ్రమంలో ఎందరో ఋషులు, మునులు, సాధువులైన శిష్యులు ఉండేవారు. ఒకసారి వర్షాకాలానికి ముందు వృద్ధుడైన మాతంగ మహర్షి వంట చెరుకు కోసం శిష్యులతో అడవికి వెళ్లాడు. కట్టెలు కొట్టి తెస్తుండగా వారి తొందర గమనానికి శ్రమ జలాలు రాలాయి. కాలక్రమంలో అవి రాలిన చోటల్లా పూల మొక్కలు మొలిచాయి. అవి వనంలా వ్యాపించి పూలతో నిండిపోయాయి. అవి వాడిపోవు మహనీయుల శ్రమ వలన రాలిన బిందువులే ఎంతో పవిత్రములై ఇలా మారాయి’’ అని ఆమె శ్రీరామచంద్రునికి వివరించింది.
రామాయణంలో శ్రమ విలువలు గోచరిస్తాయి. ఓసారి శ్రీనాథ మహాకవి పోతన కవిని కలిసి అతని కవితా మాధుర్యానికి ముగ్ధుడై ‘‘నీ భాగవత గ్రంథాన్ని సర్వజ్ఞ సింగభూపాలునికి అంకితమిచ్చి అఖండ భోగ భాగ్యాలతో సుఖములు బడియరాదా?’’ అని సూచించాడు. అంతట పోతన కవి “బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి?’’ అని.. సమాధానమిచ్చాడట.
అలా భోగాల పట్ల ఆసక్తి లేని స్వయంకృషి వ్యక్తిత్వం గల పోతన హాలికుడుగా జీవించడానికి సిద్ధమైనాడంటే, శ్రమైక జీవనానికే శృతి కలిపాడన్నది స్పష్టమవుతుంది. “సర్వం” శ్రమలోనే ఉన్నాయని ‘శ్రమయేవ జయతే, శ్రమయేవ దైవం’యని వేమన వివరించాడు.
భూమిలోని బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమలోన బుట్టు సర్వము తానౌను
విశ్వ...
అంటూ ‘‘సాధనమున పనులు సమకూరు ధరలోన”
యని శ్రమ జీవనానికి తోవ చూపాడు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఏర్పడినా, బుద్ధిమంతులు అనుకున్నది సాధించేవరకు పట్టిన పట్టు విడువరని, సుభాషితాన్ని ఏనుగు లక్ష్మణ కవి వివరించారు.
‘‘సమస్త సంపద శ్రమలోనే ఉద్భవిస్తుంది’’ అని కారల్‌మార్క్స్ అంటారు. మాక్సింగోర్కీ కార్మికులు, శాస్త్ర కారులు, కళాకారులు.. ఈ ముగ్గురు సంస్కృతి నిర్మాతలు అని పేర్కొంటారు. మానవుని స్వరూప పరిణామమంతా శ్రమ ద్వారా చెందినదని చార్లెస్ డార్విన్ శాస్త్రకారుడు రుజువుచేశారు.
తనిసిరే వేల్పులు దధి రత్నముల చేత
వెఱచిరే ఘోరకాకోల విషము చేత
వెఱచిరే యత్న మమృతంబు వొదము
దనుక నిశ్చితార్థం వదలరు నిపుణమతులు
సాగరమథనంలో ముందుగా రత్నాలు వచ్చాయి. తరువాత విషం రాగా దేవతలు భయపడి విడిచిపెట్టలేదు. చివరకు అమృతం చేజిక్కే వరకు శ్రమను కొనసాగించారు.
కరిగినను పసిడికి కాంతి రాదు
తణచినను పాలచే కూడదు వెన్న
యెరచినను గాని మణికైనా బరువు రాదు
ఇడుములను గాన నరున కేర్పడదు కీర్తి
కరిగితే గాని బంగారానికి కాంతి రాదు. కవ్వం తిప్పితే గాని వెన్న రాదు. సానపడితే గాని మణికైనా మెరుపు రాదు. అలాగే కష్టాలను దాటితే గాని మనిషి కీర్తివంతుడు కాజాలడని బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి శ్రమ విలువలకు వాణి నందించారు.
“ఒక్కొక్క అడుగు ముందు పెట్టిన ఎక్కువౌ కొండలైన ఎక్కగలవ”న్న అన్నమయ్య పద కవిత శ్రమైక జీవనానికి సంకేతమై నిలుస్తుంది.
ఫలము లేదని పనిని చేయక/విడిచి పట్టు విడవక
పనిని చేస్తూ / విఫలమొందిన వాడే మేలోయ్
అంటూ చాణక్యుడు శ్రమైక జీవనానికి రాచ బాట వేశాడు. ఒక పూర్వకవి తన చాటువులో శ్రమైక జీవన తత్పరుడు. ఒకవేళ తగ్గినంత మాత్రమున అది అతని అల్పత్వం కాదని “ఏతం చెడి” వంగినంత మాత్రంచే తక్కువ తనం కాదని.. పాతాళం నుంచీ గూనడు నీళ్లు తెచ్చేందుకే గాని చేతగానితనం కాదని సూచిస్తుంది.
చేతనగువాడు కార్యమునకై తగ్గును
వంగుగాక, అల్పుండగునా?
ఏతము చడి తావంగును
పాతాళము నీరు దెచ్చి బయలుం జల్లున్
కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి తన “కృషీవలుడు’’ కావ్యంలో శ్రమ లేకుండానే ఫలితాలు ఎగిరి ముందుకు దూకవని ఓపికున్నంత వరకు శ్రమిస్తే, సుఖం కలుగుతుందని వట్టి ఆశల కన్న గట్టి ప్రయత్నంతో మేలు చేకూరునని ఇలా వ్యక్తపరిచారు.
శ్రమలు లేకయె ఫలములు దుముక బోవు
పిండి కొలదియె రొట్టె, ఓపిన విధాన
కష్టపడుము కృషీవల! కలుగు సుఖము ఉత్త ఆసలు
కన్న ములద్యమంబు
శ్రమ ఘనతను నవతను నినదిస్తూ జాతిని జాగృత పరిచే దిశలో తుమ్మల సీతారామమూర్తి సందేశంలో..
శ్రమ పడుటే జాతికి సిరి
శ్రమ పడుటే రాజ్యమునకు సంపద యెచటన్
శ్రమ కన్పడు నచ్చట రమకన్వడు
అఖిల సుఖ పరంపర లిడగన్
శ్రమయే జాతికి సిరి సంపదయని శ్రమయే రాష్ట్రానికి భాగ్యమని శ్రమ ఉన్నచోటే, లక్ష్మీదేవి నివాసమని సకల సౌభాగ్యాలకు మూలమని శ్రమ జీవనాన్ని ప్రశంసిస్తూ స్వాగతిస్తారు. శ్రమైక జీవనమే ప్రధానమని, అది మన దిన చర్యలో భాగమని, ఒక పూర్వకవి ఇలా ప్రబోధిస్తారు.
పనియే సర్వం నీకగు/ పని యందే మనసు నిల్పు
పగలూ రాత్రిన్ పనితోనే నీ కాలం/ వినియోగం చేయవలెను విస్తృత మతినిన్
ఇక ఈ దిశలో ఆధునిక కవులు తమ కావ్యాలలో పొందుపరిచిన రీతిని గమనిద్దాం.
“శ్రీ శ్రీ” సాహిత్యంలో శ్రమైక జీవనానికి శంఖనాదం చేయబడిందిలా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని/ కదిలేది కదిలించేది/ పెను నిద్దుర వదిలించేది/ మునుముందుకు నడిపించేది/ సంపూర్ణపు బతికిచ్చేది/ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు.
కమ్మరి కొలిమి/ కుమ్మరి చక్రం/ సాలెల మగ్గం/ జాలరి పగ్గం/ శరీర కష్టం స్ఫురింపజేసే/ గొడ్డలి రంపం, కొడవలి, నాగలి/ సహస్రవృత్తుల సమస్త చిహ్నాల్/ శ్రమజీవికి దైవ సమానం అంటూ నినదించారు. ఇంకా తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ లెవ్వరు? అని ప్రశ్నించడంలో శ్రామిక వర్గ పాత్ర ఎట్టిదోయని ఆలోచింపజేస్తాడు.
విత్తు గుండె పగిలితేనే/ మొలక లేచేది/ శ్రమ జలాలు రాలిస్తేనే/ విజయం వరించేది/ మొండి బండరాయి సైతం/ ఉలి దెబ్బలు తిని, తిని, కమనీయ శిల్పమై /సాక్షాత్కరిస్తుంది. అన్న ‘‘సినారే” కవితలు శ్రమ విలువలు ప్రతిధ్వనిస్తాయి. ఆచార్య ఆత్రేయ ‘సాహిత్యంలో శ్రమ జీవనానికి తలుపులు తెరిచారిలా..
కారులో షికారుకెళ్లే/ పాలబుగ్గల పసిడి దానా చలువ రాతిమేడలోన/ కులుకుతావే చిన్నదానా/ మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చునో చెప్పగలవా/ కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచి, గనులు తొలిచి/ చెమట విలువను చేర్చి/రాళ్లను తీర్చినారు తెలుసుకో/ ధనమేరా అన్నిటికీ మూలం/ ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం/ పాలికాపు కండలలో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం అంటూ ‘ఆరుద్ర’ శ్రమజీవిని అందలం ఎక్కించారు.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు/ మహా పురుషులౌతారు అంటూ వేటూరి విజయ ఢంకా మోగించారు. పొలాల్లో రాలిన చెమట బిందువుల్ని ధాన్యపు ముత్యాలుగా మార్చి భూమి గాయాలను మాన్పుదాం పద.. ప్రేమ వానల్ని కురుద్దాం పద.. అంటూ శ్రామికుని శ్రమలు జన్మించే స్వేద బిందువులకు అధిక ప్రాధాన్యమిచ్చారు “శేషేంద్ర” తన మండే సూర్యుడు కావ్యంలో.
ఆచార్య తిరుమల సాహిత్యంలో - “పక్షికి కావలసింది గూడు కాదు రెక్క, మనిషికి కావలసింది భ్రమ కాదు – శ్రమ అంటూ మనిషి భ్రమలో జీవిస్తే ఉన్న చోటే ఉండిపోతాడు కానీ శ్రమ ఉంటే వెలిగిపోతాడు” అని యువతకు నవతను నేర్పుతాడు. -
“శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో? గింజెవడిదిరో– గంజెవడిదిరో? అంటూ.. దిగంబర కవి చెరబండరాజు (బద్దం భాస్కర్‌రెడ్డి) భూస్వామికి భోగం, శ్రామికునికి గంజి లభిస్తాయని శ్రమదోపిడి విధానాన్ని నిరసిస్తాడు. “నా సూర్యుడు మడమ తిప్పని మహోద్యమకారుడు/ విరామ మెరుగని విప్లవ వీరుడు” అంటూ ‘దేవీప్రియ’ శ్రమ జీవనానికి సూర్య గమనాన్ని ఆదర్శంగా తీసుకుంటాడు. స్వాగతిస్తాడు. దీక్షగా పట్టుదలతో చేసే పని ‘తపస్సే’ అని, అట్టి తపస్సులో ఉన్న జితేంద్రియులకు విఘ్నాలు, ప్రతిబంధకాలు కావని, “రఘువంశం” కావ్యంలో మహాకవి కాళిదాసు వివరించాడు.
“ఆగిపోదీ శ్రమ ఆరిపోదీ శ్రమ ఆగదీ సరిగమ, ఆరిపోదీ శ్రమ ఆగదీ మధురిమ నా రొమ్ములో తుది శ్వాస గుక్క ఉన్నందాక నా హృదయంలో తుది ఎరుపు చుక్క ఉన్నందాకా”
శ్రమాయణాన్ని గానం చేస్తాను అంటూ శ్రమ కావ్యాన్ని వినిపిస్తున్నారు. శ్రమలోంచి సైన్స్ కళలు ఉత్పత్తి అయ్యాయన్నది సుద్దాల అశోక్ తేజ శాస్త్రీయ ప్రతిపాదన. శ్రమ భౌతిక, బౌద్ధిక శ్రమ అని రెండు రకాలుగా తన శ్రమ కావ్యంలో వివరించారు.
ఇప్పుడు మనుషులను విడదీసే మతాలు పుట్టక ముందే తాను ఏకైక శ్రమైక మతాన్ని ప్రకటిస్తున్నాను అంటాడు. పరికరాలు సృష్టించిన తెలివి కష్టజీవిది. పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది అంటూ శ్రమజీవిని ఆకాశానికెత్తారు. అందుకే భవిష్యత్తు తరాలకు శ్రమ విలువలు నిరంతరం బోధిస్తూ.. విజ్ఞులైన వారు శ్రమైక జీవనాన్ని స్వాగతిస్తారని ఆకాంక్షిద్దాం.
భూపతి వెంకటేశ్వర్లు,
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ,
రాష్ట్ర అధ్యక్షుడు, 9490098343
